Wednesday, December 8, 2010

పల్లె ఒడి...! విశ్వ..!

నిండుగా కనిపించే పచ్చని అందాల చీర కట్టిన పైరు...
చిరుగాలి చిలిపిగా చక్కిలి గిలి పెడుతుంటే స్వేచ్చగా నవ్వుతుంది...
నిండుగా ప్రవహించే చల్లని పగడాల సెలయేటి నీరు...
చిరుగాలి వేగంతో వెంబడిస్తుంటే దొరకనంటూ పరవళ్ళు తొక్కింది...!!

తట్ల క్రింద గుట్టుగా గుడ్లు పెట్టిన కోడి పెట్టలు...
అప్పుడే పుట్టిన ఎర్రని సూర్యుడిని చూడగానే కూత పెట్టాయి...
అప్పుడప్పుడే నిద్ర లేచిన బుల్లి వల్లంగి పిట్టలు...
ఆకలితో కీచు కీచు మంటూ ఆకాశంలోకి రివ్వున ఎగిరాయి...!!

ముసిరిన పొగమంచు ముసుగులో ఆడమగలు...
నిండైన చెంబులతో నిప్పులు తొక్కుతూ ముందుకు సాగేరు...
గంజి నీటిలో ఉల్లిపాయ నంజుకొని ఆలుమగలు...
కొడవలి నాగలి చేతపట్టుకొని సాగు భూమి చెంతకు చేరారు...!!

నీలి వర్ణపు దుస్తులు ధరించిన స్కూలు పిల్లలు...
సంచులలో పుస్తకాలను సర్దుకొని సర్కారు బడిలోకి పరుగు తీసారు...
బెత్తం పట్టుకొని వేచిచూస్తున్న స్కూలు పెద్దలు...
బడికి చేరిన పిల్లలకు విజ్ఞాన పరిజ్ఞానాన్ని భోదిస్తూ గురువులయ్యారు...!!

వాకిటిలో కల్లాబుజల్లి రంగవల్లులు దిద్దే ఆడపిల్లల...
హొయలు చేస్తూ చూపు తిప్పుకోలేని కుర్రాళ్ళు మంత్ర ముగ్ధులయ్యారు...
ఇంతలో అంతరాయంలా వచ్చిన ఆడపిల్లల పెద్దల...
కేకలు వింటూ ఉలిక్కిపడ్డ కుర్రాళ్ళు రెప్పపాటులో కనుమరుగయ్యారు...!!

సకుటుంబ సపరివార సమేతంగా జరిగే పెళ్ళి సందడి...
కళ్ళారా చూసి తరించేందుకు పరీక్షలు ముగించుకొని మా ఊరు వచ్చాను...
కల్మషంలేని మా పల్లె జనం చూపించే ప్రేమ సందడి...
మనసారా ఆస్వాదించేందుకు తాతాబామ్మల గూటికి గువ్వలా వచ్చి చేరాను...!!

వస్తూనే నాటికి నేటికి ఏమాత్రం మారానని పల్లె వడిలో...
దాచుకున్న అందచందాలను తనివి తీరగా చూస్తూ తన్మయత్వం చెందాను...
వస్తూనే నేటి వరకు జీవించిన పట్టణ జీవన అలజడిలో...
కోల్పోయిన అనురాగ బంధాలను పట్టలేని ఆనందం సాక్షిగా అనుభవించాను...!!

బామ్మ చేసిన చిల్లు గారె కారం, పూర్ణం బూరె మధురం...
పులి హొర పులుపు పొగరు, ఉసిరి పచ్చడి నలుపు వగరు...
ఆహా..! ఏమి రుచి...!! ఔరా..! అనరా మైమరచి...!!
బామ్మ చెప్పిన నీతి కధలు, తాతయ్య చెప్పిన కబుర్లు...
జీవితంలో మరువలేని మరపురాని మధుర జ్ఞాపకాల గుడి, మా పల్లె ఒడి...! విశ్వ..!

4 comments:

  1. palle andaalanu anandaalnu.. aritaaku loni pindi vantalanu.. chakkagaa varninchaaru mitramaa....

    ReplyDelete