Saturday, February 26, 2011

ఓ నా ప్రియతమా...! విశ్వ..!

వాలు కనుల వగలమారి హొయల వయ్యారమా...
ఓర చూపుల వలలు విసిరే గాలమా...
చిలిపి తలపుల అలలు తాకే మనోరమా...
తొలి వలపు పులుపు తెలిపిన కాలమా...
చిరు జల్లులా నన్ను చేరే ప్రణయ విహారమా...
సిరి వెన్నెల వన్నెలు జల్లే తుహిన వర్షమా...
హరి విల్లుల వర్ణాల మిన్ను కోరే అందని అందమా...
సిరి మువ్వల నవ్వుల ఆనంద హర్షమా...
తొలకరి చినుకులు చిలికే సొగసరి తమకమా...
ప్రియ రాగపు శృతులు పలికిన పరువమా...
హృదయ వీణను మీటిన సుస్వరాల మధురిమా...
ఉదయ సంధ్యా రవి కిరణమా...
ఉభయ అధరాల దరహాసమా...
చిగురించే చిరు ఆశల తీరమా...
వికసించే విర జాజుల లీలా చిద్విలాసమా...
విహరించే మనోహర స్వప్న విహంగమా...
పల్లవించే అనురాగ సుధా అంతరంగమా...
మరణాన్ని మరల్చి వచ్చే జననమా...
చరణాన్ని స్మరించి తరించే గానమా...
కిరణాన్ని హరించి పతిధ్వనించే సంధ్యా రాగమా...
తామాసిని మాయజేసి ప్రజ్వలించే ప్రభాతమా...
తాపసిని మంత్రమేసి మత్తెక్కించే నాట్య భంగిమా...
తులసిని మరిపింప జేయు పవిత్ర మిత్రమా...
సన్యాసిని సంసారిగా చేయు విచిత్ర ఆత్రమా...
సన్నాసిని సమర్థునిగా మార్చు త్రినేత్ర అగ్ని హొత్రమా...
హృదయా(లయ)కారక తారక మంత్రమా...
రతీ మన్మధ సరసక్రీడా శృంగార తంత్రమా...
మనోరంజిత మంజీర వాణీ వినోదమా...
ముగ్ధ మనోహర కృష్ణ వేణీ తరంగామా...
మనస్సు బడి చేరిన అభినవ వేదమా...
వయస్సు మడి దాటిన ప్రణవ నాదమా...
విశ్వ విఖ్యాత యాసస్సుకి చిరునామా...
దయా హృదయ ఉషస్సుకి ప్రతిబింబమా...
లోక ప్రక్యాత తెజస్సుకి (ప్రేమకి) ప్రాకారమా...
నా జీవన శ్రీకారమా.. సాకారమా.. ఓంకారమా... ఓ నా ప్రియతమా...! విశ్వ..!

No comments:

Post a Comment