Wednesday, December 8, 2010

పల్లె ఒడి...! విశ్వ..!

నిండుగా కనిపించే పచ్చని అందాల చీర కట్టిన పైరు...
చిరుగాలి చిలిపిగా చక్కిలి గిలి పెడుతుంటే స్వేచ్చగా నవ్వుతుంది...
నిండుగా ప్రవహించే చల్లని పగడాల సెలయేటి నీరు...
చిరుగాలి వేగంతో వెంబడిస్తుంటే దొరకనంటూ పరవళ్ళు తొక్కింది...!!

తట్ల క్రింద గుట్టుగా గుడ్లు పెట్టిన కోడి పెట్టలు...
అప్పుడే పుట్టిన ఎర్రని సూర్యుడిని చూడగానే కూత పెట్టాయి...
అప్పుడప్పుడే నిద్ర లేచిన బుల్లి వల్లంగి పిట్టలు...
ఆకలితో కీచు కీచు మంటూ ఆకాశంలోకి రివ్వున ఎగిరాయి...!!

ముసిరిన పొగమంచు ముసుగులో ఆడమగలు...
నిండైన చెంబులతో నిప్పులు తొక్కుతూ ముందుకు సాగేరు...
గంజి నీటిలో ఉల్లిపాయ నంజుకొని ఆలుమగలు...
కొడవలి నాగలి చేతపట్టుకొని సాగు భూమి చెంతకు చేరారు...!!

నీలి వర్ణపు దుస్తులు ధరించిన స్కూలు పిల్లలు...
సంచులలో పుస్తకాలను సర్దుకొని సర్కారు బడిలోకి పరుగు తీసారు...
బెత్తం పట్టుకొని వేచిచూస్తున్న స్కూలు పెద్దలు...
బడికి చేరిన పిల్లలకు విజ్ఞాన పరిజ్ఞానాన్ని భోదిస్తూ గురువులయ్యారు...!!

వాకిటిలో కల్లాబుజల్లి రంగవల్లులు దిద్దే ఆడపిల్లల...
హొయలు చేస్తూ చూపు తిప్పుకోలేని కుర్రాళ్ళు మంత్ర ముగ్ధులయ్యారు...
ఇంతలో అంతరాయంలా వచ్చిన ఆడపిల్లల పెద్దల...
కేకలు వింటూ ఉలిక్కిపడ్డ కుర్రాళ్ళు రెప్పపాటులో కనుమరుగయ్యారు...!!

సకుటుంబ సపరివార సమేతంగా జరిగే పెళ్ళి సందడి...
కళ్ళారా చూసి తరించేందుకు పరీక్షలు ముగించుకొని మా ఊరు వచ్చాను...
కల్మషంలేని మా పల్లె జనం చూపించే ప్రేమ సందడి...
మనసారా ఆస్వాదించేందుకు తాతాబామ్మల గూటికి గువ్వలా వచ్చి చేరాను...!!

వస్తూనే నాటికి నేటికి ఏమాత్రం మారానని పల్లె వడిలో...
దాచుకున్న అందచందాలను తనివి తీరగా చూస్తూ తన్మయత్వం చెందాను...
వస్తూనే నేటి వరకు జీవించిన పట్టణ జీవన అలజడిలో...
కోల్పోయిన అనురాగ బంధాలను పట్టలేని ఆనందం సాక్షిగా అనుభవించాను...!!

బామ్మ చేసిన చిల్లు గారె కారం, పూర్ణం బూరె మధురం...
పులి హొర పులుపు పొగరు, ఉసిరి పచ్చడి నలుపు వగరు...
ఆహా..! ఏమి రుచి...!! ఔరా..! అనరా మైమరచి...!!
బామ్మ చెప్పిన నీతి కధలు, తాతయ్య చెప్పిన కబుర్లు...
జీవితంలో మరువలేని మరపురాని మధుర జ్ఞాపకాల గుడి, మా పల్లె ఒడి...! విశ్వ..!

ఎళ్ళిపోయినాది...! విశ్వ..!

మూడేండ్లు మనసారా ప్రేమించి పెద్దోళ్ళనెదిరించి మూడు ముళ్ళేసినా...
నూరేండ్లు సుఖంగా కలిసి బ్రతకాలని ఎంకన్న సామికి పదే పదే మొక్కినా...

మూడంతస్తుల మేడ కట్టి పెళ్ళాం పిల్లలతో కాపురముండాలని కలలు కనినా...
పెళ్ళాం నెలతప్పినాదని డాక్టరమ్మ సెప్తే సంబరంతో ఎగిరి గంతులేసినా...

ముడోనేల నుండి నెలలు నిండే దాకా కాలు కందనీకుండా జాగ్రత్తా సూసుకొనినా...
పుట్టబోయే నా బిడ్డకు ఏలోటు లేకుండా సూసుకోనీకి ముందే అన్నీ కొనిపెట్టినా...

బిడ్డ పుట్టినాక తల్లీ బిడ్డా సల్లంగుండాలని రాములోరి గుడిలో పూజలు సేసినా...
కాని రాములోరు నన్ను సల్లంగ సూడలే... ఎంకన్న సామికి నా మొర వినబడలే...

కళ్ళు తెరవని పసి కూనను నా సేతుల్లో పెట్టి, నా ప్రాణం కళ్ళు మూసినాది...
కన్న బిడ్డను ప్రాణంగా సూసుకోమని సెప్పి నన్నొదిలి ఎళ్ళిపోయినాది...! విశ్వ..!

హృదయం...! విశ్వ..!

శుప్రభాత సమయాన మేలుకొనిన నా ప్రియ హృదయానికి ప్రతి ఉదయం శుభోదయం...
ఆ సుందర సుకుమార సుమనోహర రూపాన్నిగాంచిన కన్నులకు తెలియదు సమయం...

అనురాగ తరంగాల తాకిడికి మ్రోగిన హృదయ మృదంగం ఆలపించింది ప్రేమ గేయం...
శ్వాసలో పరిమళాల ప్రవాహంలో నీవు అణువణువునా చేరి చేసావు తీయని గాయం...

ఆనందపు అందాల మకరందాలలో మునిగి ఉన్న నీవు పవిత్రమైన ప్రేమకు నిలయం...
సంకృతి సాంప్రదాయాది సకల సుగుణ సంపద కలిగి ఉన్న నీవు ప్రియమైన ఆలయం...

కరుణామృత వర్షినివైన నీవు ప్రేమార్ధినై హృదయపు వాకిలిలో వేచియున్న నాకు అందించు ప్రేమ సహాయం...
నీ హృదయ తీరానికి దూరమైపోతూ విన్నపాలసంద్రంలో చిక్కుకున్న నా(వ)కు మిగిలేది విరహాల ప్రళయం...

నీ జ్ఞాపకాల నిర్భందనలో బంధీగా మారి నీ ప్రేమ విడుదలకై ఎదురుచూస్తున్న ప్రియునికి మిగిలేది విలయం...
తనమనధన ప్రాణాల కన్నా మిన్నగ నిన్ను ప్రేమించే స్వచ్చమైన ప్రేమను నీవు కాదంటే చెందాను విస్మయం...

నీ కల్మషంలేని ప్రేమను పొందలేని ఈనా జీవితాన్ని ద్వేషించే నిజమైన ప్రేమికుని ప్రేమపై నీకేల చెలి సంశయం...
అమరమైన ప్రేమను నీ ఎదలోతుల్లో కలిగించిన నాడు నిఖిలమై అఖిలమై సత్యమైన నా ప్రేమకు అభ్యుదయం...

అనంతమైన ప్రేమను గుండెల్లో నింపుకొని నీ ప్రేమకోసం కానుకగా మలచి అర్పిస్తున్న అందుకోనా హృదయం...
అనుక్షణం నీ కనుపాపలా నీకు కాపలా ఉంటూ ప్రతిక్షణం నీలో ధైర్యమై చేరి అందిస్తా నీ భయాలకు అభయం...


నువ్వు పంచిన చేదు జ్ఞాపకాలతో నిండుకున్న ఆలోచనలకు నీవు సర్వదా చిరస్మరనియం...
శుభప్రద సమయాన మేలుకొనిన నా ప్రేమ మాధుర్యం మాత్రం... అద్వితీయం... అనిర్వచనీయం...! విశ్వ..!

వెళ్ళకే...! విశ్వ..!

చూడకే చెలి చూడకే చిలిపిగా నను చూడకే...
కొంగు చాటున మాటుగా నువు తొంగి తొంగి చూడకే...

వాలుకన్నుల చూపులతో గాలమేసి లాగాకే...
గుండె గూటిలో గువ్వలా చేరి నీపై ప్రేమ ఆశలు రేపకే...

ఓర కంట చూడకే చూసి కనికట్టుని చేయకే...
మనసు వాకిలిలో గుట్టిగా చేరి వలపు తలుపులు తట్టకే...

చూపులతో మాయజేసి మత్తుమందు చల్లకే...
వయసు మెరుపులతో మురిపించి నన్ను వదలి వెళ్ళకే...! విశ్వ..!

అంతం...! విశ్వ..!

తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరో ప్రాణానికి జన్మ ప్రసాదించే తత్వం స్త్రీ జాతికే అంకితం...
నరక యాతనను స్వర్గ సౌఖ్యంగా భరించి అమ్మ అనే పిలుపుతో తరించే స్త్రీ మూర్తికి వందనం...

అమ్మ మమతానురాగాలను గోరు ముద్దలుగా మలచి మనకు అందించే అమృత హస్తం...
అన్నయ్యా...! అని నోరారా పిలిచే ప్రేమతత్వం, ఆటపట్టించే చిలిపితనం చెల్లెమ్మ మనస్తత్వం...

ముట్టుకుంటే కందిపోయే స్వచ్చమైన సున్నితత్వం, మాటంటే తట్టుకోలేక కన్నీరు కార్చే మచ్చలేని అమాయకత్వం...
కష్టసుఖాలలో సహధర్మచారిగా కడవరకు తోడుగ నిలిచే నమ్మకత్వం, ప్రియుని యెదలో ప్రేమగ పలికే కవిత్వం...

కష్టాలలోయలో ఉన్నవారిని చూడగనే కరుణతో కరిగే హృదయం, దేవతాది గణాలు భక్తితో కీర్తించే స్త్రీమూర్తి దేవాలయం...
బ్రహ్మయ్యా...! అంతటి దైవసమానమైన స్త్రీ జాతిపై ఎన్నో అరాచక క్రీడలు, ఏమిటి ఈ ఘోరం...

జన జీవన స్రవంతిలో స్వేచ్చగా సంచరించలేని సగటు స్త్రీ దుర్గతి వర్ణనాతీతం, ఎవరు చేసినది ఈ నేరం...
పురుషాధిక్య సమాజంలో పురుషాహంకారానికి బలి పశువుగా మగ్గుతున్న స్త్రీ మూర్తి సమస్యలకు ఎక్కడ ఉంది పరిష్కారం...

కామంతో కళ్ళు మూసుకుపోయి వావి వరసలు మరచి తీర్చుకొనే అత్యాచారాల కామ దాహం, ఇదేనా మన సమస్కారం...
ప్రేమతో ఉన్మాదులుగా మారి అభం శుభం ఎరుగని బాలికలపై అమానుష దాడుల మారణ హొమం, ఇదేనా మన ఘన కార్యం...

కనిపించే ప్రతి స్త్రీ మూర్తిలో కనిపెంచిన మాతృ మూర్తిని చూడలేని మనిషికి మృగానికి ఎక్కడ ఉంది వెత్యాసం...
కోమల కమల నయానాలలో విషాద అసృవులను నింపానని విర్రవీగే మతిచేలించిన వాడి జీవితం కాదా పరిహాసం...

అనంతమైన జీవన్మరణ చెక్ర వ్యుహపు వలయంలో సంధించే ప్రశ్నల అస్త్రాలకు ఎక్కడ ఉంది అంతం...
అనంత ప్రాణ కోటికి మూలమైన స్త్రీ జాతిని గౌరవించి, జీవితాంతం రక్షించుకొనుట ఒక్కటే ఈ దారుణానికి అంతం...! విశ్వ..!

పెంపొందించుకో...! విశ్వ..!

భగవంతుని పాదపద్మాలయందు పరిమళాల పద్మములు ఉంచే ముందు...
నీ హృదయపు గదులలో ఉన్న ఈర్షాసూయలను తొలగించి ప్రేమ సుగంధాలను నింపుకో...

దైవ సానిధ్యంలో ధూప దీప నైవేద్యాలను ఉంచి భక్తితో ఆరాధించే ముందు...
నీ హృదయంలో ఉన్న అపరాధాందకారాన్ని తొలగించి పశ్చాతాప దీపపు వెలుగు నింపుకో...

మాధవుని సన్నిధిలో వినయవిధేయతలతో శిరసు వంచి నమస్కరించే ముందు...
నీ పరిసరాలలో ఉన్న అభాగ్యులను మానవత్వంతో ఆదరించి నిన్ను నువ్వు సమస్కరించుకో...

సర్వాంతర్యామి కోవెలలో భక్తి పారవశ్యంతో శ్రాష్టాంగ వందనం చేసే ముందు...
నీ కనుచూపుమేరలో కనిపించే మంచితనపు మనస్తవ్వానికి పాదాభి వందనాన్ని చేసుకో...

భక్తవత్సలుని పాపభీతితో పాప ప్రక్షాళనచేయు క్షమాభిక్షను కోరుకొనే ముందు...
నీ శేరను కోరి వచ్చిన శత్రువుని సైతం క్షమించగలిగే క్షమాగుణాన్ని నీలో పెంపొందించుకో...! విశ్వ..!

రాజకీయాలు...! విశ్వ..!

నేను ఈ గలీజు రాజకీయ నాయకుల్ని నమ్మను తమ్మి...
పచ్చి మాంసం తిని పీకలదాకా తాగి తందనాలాడే ప్రతీ రౌడీ నాకొడుకు...
రాజకీయాల్లోకి వస్తంటే ఎట్లా ప్రపంచలో కెల్లా టాపైతది మన దేశం...!!
కత్తి పట్టే ప్రతీవోడు జెండా పట్టుకొని... కాలరు పట్టుకొనే ప్రతీవోడు కాళ్ళు పట్టుకొని...
ఓట్ల కోసం కుక్క లెక్క వెంట పడతాంటే ఎట్లా బాగుపడతది ఈ దేశం...!!
నేరాలు ఘోరాలు సేసెటోడు రాజకీయాల్ల పోటీ సేయనీకి...
అర్హతలున్నోడని పార్టీలు రచ్చచేస్తాంటే ఈ రాజకీయాల్ని రొచ్చు రాజకీయాలనక...
ఇంకేమనాలె... ఏ ధైర్యంతో యువత రాజకీయాల్లోకి రావాలె...!!
ఓట్లు కోసం సీట్ల కోసం ఏదైనా చేస్తరు...
కలరు టీవి ఇస్తరు... వాటరు కూలరు ఇస్తరు...
మందు సీసాలిస్తరు... పట్టుబట్టలతో కొడతరు...
కరన్సీ నోట్లతో బేరం పెడతరు... మస్త్ కాకా పడతరు...!!
ఓట్లు వేసి గెలిపించినాక మళ్ళి ఎలక్షన్లకే కనిపిస్తరు...
నువ్వు వేస్తనన్న తారు రోడ్లు యాడ... నువ్వు కట్టిస్తనన్న మరుగు దొడ్లు యాడ...
నువ్వు ఇప్పిస్తనన్న మంచి నీరు కనక్షన్లు యాడ...
మస్తుగా పైసలు కలక్షన్లకే నీ కాడ టైము లేకుంటే... ఎలా చేస్తవులే సారు...!!
నీ కాళ్ళు మొక్కుతా బాంచన్, నా మాట ఇనుకో...
మళ్ళి ఎలక్షన్ల ఓట్లు అడ్డుకుంటూ మా ఇంట్లకు రామాకు సామి...
నువ్వేదో సేస్తావని నీ చేతికి అధికారమిస్తే...
పంది కొక్కు లెక్క సర్కారు ఖజానాకు బొక్కలు పెట్టి తిని తొంగుంటన్నావు...
నిన్ను గిట్లా సూస్తుంటే నాకొకటి యాదకొస్తది...
గొర్ర కసాయోడ్ని నమ్మినట్టు నేను నిన్నెట్లా నమ్మిననా అనిపిస్తది...!!
నీ కన్నా మా ఇంట్ల కుక్కను నీ సీట్ల ఎక్కించి ఉంటే...
మా సొమ్ము తినె నీలటోడి కండలు పీకి, బొక్కలిరగ దీసెటిది...
తప్పు జేసినా బాంచన్... మళ్ళి గిసువంటి తప్పు చెయ్య...!!
అయినా నా పిచ్చిగాని మేము ఒట్లేయకుంటే మాత్రం గెలువావా ఏంది...
బెగ్గింగు సేసెటి నువ్వు... రిగ్గింగు సేయలేవా ఏంది...
ప్రజా సొమ్ము దొబ్బితినే నువ్వు... ఎదురు తిరిగితే మర్డర్లు సేయవా ఏంది...!!
సేసినా సేస్తవు, ఎందుకంటే చట్టాన్ని కాపాడే ఖాకీ చొక్కాలు...
నీ అధికారానికి సలాం చేస్తయి..! న్యాయాన్ని కాపాడే నల్లకోటులు...
నీ కరన్సీ నోట్లకు గులాం ఐతయి..! నిన్ను అడ్డుకొనేటోడు యాడ పుట్టినాడో...!!
ఒక్కటి మాత్రం యాదుంచుకో ప్రతినిధి సారు...
నువ్వు సచ్చినాక నిన్ను కాల్చేది ఎండిన కట్టెలతోనేగాని నోట్ల కట్టలతో కాదు...
నువ్వు బుడిదయ్యినాక కలిపేది ప్రవహించే నీటిలోనేగాని పరిమళాల పన్నిటిలో కాదు...
నువ్వు పాపాలు చేసి కుదబెట్టింది పెళ్ళాం బిడ్డలు అనుభవిస్తరేగాని నువ్వు కాదు...
నువ్వు ఎంత సంపాదించినగాని పోయినాక ఒక్క పైసాకూడా నీతో రాదు...
నువ్వు చేసిన తప్పుల నుంచి ఈడ తప్పించుకుంటవుగాని నరకంలా శిక్ష తప్పదు...
నువ్వు తీసిన ప్రాణాల ఉసురు తగలకపోదు బాంచన్...
ఎంత సంపాదిస్తవో, ఎంత ఎనకేసుకుంటవో ఎనకేసుకోగాని కుక్కసావు మాత్రం తప్పదు...!!
తప్పు సేసినవు సారు..!
నిస్వార్ధ రాజకీయాలను స్వార్ధంతో కుళ్ళబెట్టి తప్పు సేసినవు...
మాయక నాయకుల కాళ్ళు పట్టి, అమాయక ప్రజల కడుపు కొట్టి తప్పు సేసినవు...
ప్రజాసేవ చేసెటోళ్ళ మేడలు కొట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థను లంచాలతో కూలగొట్టి తప్పు సేసినవు...
తప్పు సేసినవు సారు..!
విసిగిపోయి అడవిబాట పట్టిన అన్నల సేతుల్లో తప్పక సస్తవు, కుక్కసావు సస్తవు...
నిన్ను నమ్మిచెడినోడి ఉసురు తప్పక తగుల్తది నీకు... కుక్కసావు సస్తవు దొర...! విశ్వ..!

కాదంటారా...! విశ్వ..!

సమైఖ్యత అంటూ నినాదాలు చేస్తే.. సమైఖ్య వాదుల నాలిక కోస్తా...
మా తెలంగాణా రాష్ట్ర విభజనను అడ్డగిస్తే.. ఎవ్వరినైనా అడ్డంగా నరికేస్తా...

కలిసి ఉంటే కలదు సుఖం వంటి నీతులు వల్లిస్తే.. తల తీస్తా...
ప్రత్యెక తెలంగాణా ఉద్యమాలకు అడ్డునిలిస్తే.. ముఖ్యమంత్రినైనా బహిష్కరిస్తా...

ఇప్పటికైనా మా ప్రాంతానికి రాష్ట్ర హొదా కల్పించకుండా జాస్తి చేస్తే..
ఉద్యమాలను ఉదృతం చేసి రాష్ట్రమంత నిరసన జ్వాలలతో అల్లకల్లోలం సృష్టిస్తా...

ఈ మాటలన్నీ ప్రాస కోసం కవి ఊహాగానాలు కావు...
కల్పితాలు కానే కావు... తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమించే నేతల మాటలు...

ఇదేనా నాయకులు మాట్లాడే తిరు..? ఇదేనా ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ..?
ఈ మాటలలో ఆవేశం తప్ప ఆలోచన కనిపిస్తుందా..? హింసాతత్వం తప్ప ఉద్యమతత్వం మచ్చుకైనా ఉందా..?

ఆలోచించండి మహా జనులారా..! ఇది సరైన మార్గామేనా, కాదు...
నాయకులారా..! ఆవేశం ఆవేదనకు పరిష్కారం కాదు, అనర్ధాలకు మూలకా(రణం)...

అహింసా మార్గమే అందరికీ శ్రేయస్కరం...
నోరుజారి ప్రసంగించుట సమాజానికి హానికరం.. కాదంటారా...! విశ్వ..!

తెలుపుతున్నా ప్రియా...! విశ్వ..!

నీదు దర్శనానికి వేచియున్న నయానాలలో నీ రూపు కానరాక నిండియున్న కన్నీరే నిదర్శనం...
నీవు నా దరి లేకున్నా, నువ్వెకడ ఉన్నా మనసులో నీ రూపాన్ని అపురూపంగా చూస్తున్నా ప్రియా...

నిశి కమ్మిన ఆకాశాన తారకవు నీవైతే.. మేఘాల పల్లకిలో నిన్నేలగ వచ్చిన శశిని నేనవుతా...
జగతిని సంరక్షించే వైష్ణవి నీవైతే.. నిన్ను నాలో సగ భాగంగా భావించే జగదేశ్వరుడ్ని నేనవుతా...

కలిమి కోరే చెలిమి నీవైతే.. నీ చెలిమి కోరే నేస్తాన్ని నేనవనా...
ప్రేమను పంచే ప్రాయాసి నీవైతే.. నీ ప్రేమను పొందే ప్రియుని నేనవనా...

మంచిని పెంచే మనిషివి నీవైతే.. నీ మంచిని పంచుకొనే మనసుని నేనవనా...
వెన్నెల కురిపించే జాబిలి నీవైతే.. నీ వెన్నెల వెలుగులతో నిండే రేయిని నేనవనా...

చల్లని చినుకు చిలికే మేఘానివి నీవైతే.. నీ చినుకుని కరిగించే చిరుగాలి నేనవనా...
నింగిలో రంగుల ధన్నస్సు నీవైతే.. నీ రంగులను మెరిపించే రవి కిరణం నేనవనా...

నేలపై చుక్కల అల్లికవు నీవైతే.. నీ అల్లికకు అందాన్ని అద్దే రంగుని నేనవనా...
కోపముతో అలకవు నీవైతే.. నీ అలకను మరిపించే బిజ్జగింపు నేనవనా...

భారముతో కన్నీరు నీవైతే.. నీ కన్నీటిని తుడిచే వేలును నేనవనా...
ఎవరూ లేరనే భయం నీవైతే.. నీ భయానికి అభయాన్ని నేనవనా...

నువ్వెక్కడ ఉన్నా నీ పక్కన నీడల్లే రానా.. నీవేపని చేస్తున్నా నీ జ్ఞాపకాలలో నేలేనా...
మన మధ్య దూరం ఉన్నా స్నేహమనే కోవలలో కవితార్చన చేసి నీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా ప్రియా...! విశ్వ..!

మా(నవ) ఆ(హారం)...! విశ్వ..!

దానము చేయని ధనికునికి ఏమి తెలుసు ఆకలి విలువ...
ధాన్యము లేని పేదవాని ఖాళీ కడుపుకు తెలుసు ఆ(కలి) విలువ...

పచ్చ నోటు ఉంటే లేదుర ఏ గొడవ...
పచ్చ నోటు లేకుంటే లేదుర ఏ విలువ...

కాసులున్న ప్రతివాడు రాజులకే రారాజు...
కాసుల సున్నా ఉన్ననాడు వాడు వట్టి బూజు...

పైసల కోసం లేనివాడు ప్రతి రోజు చేస్తాడు పోరాటం...
పైసలు ఎన్ని ఉన్నా తనివి తీరదు ఉన్నవాడి ఆరాటం...

ధనమేరా దేవుని అవతారం.. ధనమేరా జీవుని ఆచారం...
ధనమేరా జీవన ఆధారం.. ధనమేరా మా(నవ) ఆ(హారం)...! విశ్వ..!

నీ ఋణాన్ని తీర్చుకోలేను...! విశ్వ..!

మాటలు సైతం రాని నాతో మధురమైన పాటలు పాడించావు...
ఓనమాలు సైతం రాని నాతో భావ కవిత్వాన్ని పలికింపజేశావు...

నడకలు రాని నా పాదాలకు జీవితంలో నడవడికను నేర్పించావు...
పసివానిగా ఉన్న నన్ను ఆత్మాభిమానం ఉన్న మనిషిగా మలిచావు...

ఏమి తెలియని నాకు అన్నీ నువ్వై ఏ లోటు రాకుండా పెంచావు...
అల్లరి చేసినా కసురుకోకుండా అల్లారు ముద్దుగా ప్రేమను పంచావు...

ఆటలో కిందపడి కాలు కందితే కంగారుగా కంటతడి పెట్టేవు...
తోటలో చెట్టులెక్కి ఆటలాడితే తప్పురా కన్నాని గోముగా చప్పేవు...

చలితో వణుకుతుంటే కంటికి రెప్పలా నన్ను హత్తుకున్నావు...
వానలో తడిస్తుంటే పరుగన వచ్చి కొంగు చాటున నన్ను దాచావు...

గమ్యం తెలియని నాకు మార్గాన్ని నిర్దేశించే గురువు అయ్యావు...
ప్రేమను పంచే తత్వంలో మాతృత్వాన్ని మించింది లేదనిపించావు...

నువ్వు లేని నన్ను ఊహలో సైతం ఊహించాకోలేను...
ఎన్ని జన్ములు ఎత్తినా అమ్మా నీ ఋణాన్ని తీర్చుకోలేను...! విశ్వ..!

స్పందించే హృదయం...! విశ్వ..!

ఈ మనసులో ప్రతి మలుపు నీ జతగా బ్రతకడానికే అంతులేని ఆరాటం...
ఈ వయసులో ప్రతి పిలుపు నీ ప్రేమను పొందటానికే అలుపెరుగని పోరాటం...

ఈ కన్నులలో ప్రతి చూపు నీ జాడ కోసం తీక్షణమైన వీక్షణం...
ఈ జీవితంలో ప్రతి క్షణం నీ దివ్య దర్శనానికై అనంతమైన నిరీక్షణం...

ఈ లోకంలో ప్రతి ఒక్కరు నీ లాగా కనిపించే వైనం...
ఈ విశ్వంలో ప్రతి అడుగు నీ ప్రేమను చేరడానికే పయనం...

ఈ ప్రకృతిలో ప్రతి పువ్వు నీ నవ్వులా వికసించే తరుణం...
ఈ దేహంలో ప్రతి అణువు నీ రూపాన్ని నింపుకున్న ప్రాణం...

ఈ వేకువలో ప్రతి దినం నీ ముఖారవిందం ఉదయించే ఉదయం...
ఈ ప్రేమలో ప్రతి నిమిషం నీ అందమైన జ్ఞాపకాలతో స్పందించే హృదయం...! విశ్వ..!

నిగ్రహంగా గ్రహించు...! విశ్వ..!

ఆడపిల్ల పుట్టినింట సిరులొలికే లక్ష్మి నివాసం...
ఆడపిల్ల మెట్టినింట కన్నీరు చిలికే వేధింపుల సావాసం...

ఆడపిల్ల చదువులలో సరస్వతీ మానస పుత్రిక...
ఆడపిల్ల కళాశాలలో ప్రేమోన్మాదుల వేధింపులకు బలయ్యే వేదిక...

ఆడపిల్ల సహనంతో ఉంటే అనుకులవతిగా కీర్తిస్తారు...
ఆడపిల్ల ఉద్రేకంగా ఉద్యమిస్తానంటే ఉక్కుపాదంతో అనిచేస్తారు...

ఆడపిల్ల వ్యక్తిత్వం ఆదర్శనీయమైతే అభినందనీయం...
ఆడపిల్ల వీధులలో బలి తెగించి ప్రవర్తిస్తే సమాజం విమర్శనీయం...

మీరన్నది నిజమే...
పర స్త్రీలను మాతృ సమానంగా గౌరవించే శ్రీ రామ రాజ్యం కాదిది...
సి.సి. కెమెరాలతో పర స్త్రీలను చెరపట్టే మానవ దానవుల రావణ రాజ్యమిది...

మీరనుకున్నది నిజమే...
ఆపదలో ఉన్న అబలను ఆదుకొనే ద్వాపరయుగం కాదిది...
ఆపదలో ఉన్న అబలను చూసి రాక్షసంగా నవ్వుకొనే రాజకీయ కీచకుల కలియుగమిది...

తనకు జరిగే అన్యాయాన్ని స్త్రీ జాతి ఎదిరించాలి...
తనకు కలిగే అవమానాన్ని స్త్రీ శక్తి సమిష్టిగా నిరోధించాలి...

తనకు జరిగే అగౌరవాన్ని స్త్రీ మూర్తి నిర్మూలించాలి...
తనకు జరిగే అసౌకర్యాన్ని స్త్రీ ముక్త కంఠంతో సమాజాన్ని ప్రశ్నించాలి...

నైతికంగా దిగజారిపోతున్న మన దేశ సంస్కృతి సాంప్రదాయాల విలువలను కాపాడాలి...
అభివృద్ధి నెపంతో పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న నవ యువతను కాపాడాలి...

సాంప్రదాయ వస్త్రాలకు స్వస్తి పలికి వీధులలో అర్ధనగ్నంగా సంచరించే యువతిని కాపాడాలి...
విధ్యాభ్యాస ధ్యాసకు స్వస్తి పలికి కళాశాలలో యువతిపై దుమికే యువకుని చేష్టను ఆపాలి...

చేతులు కాలాక ఆకులను ఆశ్రయించినా ప్రయోజనం లేదు...
అన్యాయం జరిగాక కన్నీరు కార్చినా తగిలిన గాయం మాయం కాదు...

చేతులు కాలక మునుపే చైతన్య వంతులు కండి...
అన్యాయం జరగక మునుపే అధర్మాలపై తిరుగుబాటు చేయండి...

విదేశి యువతీయువకులు సైతం గౌరవించే మన సాంప్రదాయాన్ని మగువా మరువకు...
స్వదేశి సాంప్రదాయాన్ని ఆధునికత మోజులోబడి విస్మరించి ఆపదలను ఆహ్వానించకు...

సమాజం నిన్ను గౌరవిస్తుంది కనుకనే సింహాసనంలో సగ భాగం నీదన్నది...
సమాజం నీకు విలువిస్తుంది కనుకనే దేశానికే రాష్ట్రపతి హొదాను నీకు కల్పించింది...

ఎందులోనూ మగవారికి తిసిపోమనే మీ ఆత్మవిశ్వాసానికి కానుకగా...
అన్నీ రంగాములలోను స్త్రీ జాతికి ఉన్నత స్థానాన్ని ఇచ్చి పడతి ప్రతిష్టను పెంచింది...

ఎందులోనూ మగవారికి తిసిపోమనే మీ మితి మీరిన విశ్వాసం సాక్షిగా...
పబ్బులలోను, క్లబ్బులలోను డబ్బులు వెదజల్లుతూ వ్యసనాలకు బానిసవై దిగజారిపోయావు...

నేను సంపాదిస్తున్నాను.. నా సంపాదన నా ఇష్టం.. నువ్వెవరు నన్నాపడానికి...?
అనే స్థాయికి చేరుకొని నిన్ను నువ్వు నిరూపించుకొనేందుకు నీకిచ్చిన స్వాత్రంత్రాన్ని నేలపాలు చేసావు...

ఎలా ఉంటుంది నేటి నవ సమాజంలో స్త్రీకి బద్రత...?
నిన్ను నువ్వు ప్రశ్నించుకో.. నిన్ను నువ్వు సమస్కరించుకో...

నీ ప్రవర్తనలో పరివర్తనను సాధించుకో.. నీ నడవడికను మార్చుకో...
నీ ఆవేదనకు ఆవేశంతో పాటుగా ఆలోచనను జత చేసి చూడు న్యాయం నీదవుతుంది...

నువ్వు మారిన క్షణం, సమాజం సైతం మారుతుంది...
నిన్ను నువ్వు సమస్కరించుకున్న తరుణం, సమాజం నీకు నమస్కరిస్తుంది...

జగన్మాతకు కోపమొస్తే ఈ సృష్టికి అంతం తప్పదు అదే సమయంలో...
జగదేశ్వరునికి క్రోదమొస్తే ఈ సృష్టికి ఆది.. పునాది అనేదే ఉండదు, ఈ సృష్టి రహస్యాన్ని నిగ్రహంగా గ్రహించు...! విశ్వ..!

ఏమని చెప్పను...! విశ్వ..!

ఎందుకు తనని ప్రేమించావని అడిగితే ఎలా చెప్పను....! ఏమని చెప్పను...!
ఎలా ప్రేమించావు, ఎంత ప్రేమించావని అడిగితే చెప్పడానికి ప్రయత్నిస్తాను...

నా మానాన నేను ఇంటికి వెళ్తున్నా ఇంతలో ఏమైందో కాని...
హటాత్తుగా ఆకాశమంతా కారు మబ్బులు కమ్ముకున్నాయి...

చల్లని చిరుగాలులు మెల మెల్లగా వేగాన్ని పుంజుకుంటూ వీయ సాగాయి...
నల్లని ఆకాశంలో ఉరుముల మెరుపులతో విరుచుకు పడుతూ మెరిసాయి...

అంత వరకు నిప్పులు చెరిగిన సూరీడు మబ్బుల చాటున వదిగాడు...
ఇంత వరకు వేడితో మాడిన దేహం చిరుజల్లులో తడిసి చల్లబడింది...

ఇంతలో వింతగా ఎన్నడు లేని కవ్వింత మనసులో మొదలైంది...
కలలలో కనిపించే అందాల రాసి కన్నుల ముందు నిజమై నిలచింది...

ఇంతకు మునుపు తనను చూసింది లేదు... తనతో మాట్లాడింది లేదు...
ఎందుకో తెలియదు తనను చూడగానే మదిలో ఏదో తెలియని ఆనందం...

ఒక్కసారిగా హృదయంలో సుమధుర సంగీతం శృతి మించి పల్లవించింది...
రెప్పపాటు కాలాన్ని సైతం వృధా చేయకంటూ తన వైపు చూపు సాగింది...

నా ప్రమేయం లేకుండానే పాదం తన అడుగుల ప్రయాణంలో పయనించింది...
ఎందుకో ఈ వింత పరిణామం బహుశా మునుపెన్నడూ చూసి ఉండను అంతటి అందం...

తన నవ్వును చూస్తుంటే జగాన్నే జయించినంత సంతృప్తి ఎందుకో నాలో కలిగింది...
అది ప్రేమనో.. ఆకర్షనో తెలియదు కాని తనని అదేపనిగా చూస్తూ ఉంటే చాలనిపించింది...

తన కోసం ఎన్ని వేల సార్లు మరణించినా ఒక్క సారి జన్మించాలని అనిపించింది...
అది వరమో.. కలవరమో తెలియదు కాని తన జతలో మరణం తృణ ప్రాయమనిపించింది...

ఎందుకు నన్ను ప్రేమించావని తను నన్నడిగితే... మౌనమే నా సమాధానం...!
ఒకరిని ద్వేషించడానికి లక్ష కారణాలు చెప్పవచ్చు కాని ప్రేమించడానికి కారణం అడిగితే ఏమని చెప్పను...! విశ్వ..!

జాతి పిత...! విశ్వ..!

మచ్చలేనిది నీ చెరిత... స్వచ్ఛమైనది నీ ఘనత...
స్వార్ధం మరచిన జాతి పిత... నిస్వార్ధం నడిపిన జగతి హిత...

పదవులు ఆశించని నిజమైన ప్రజా నేత...
నీకు ఋణపడి ఉంది నీవు చూపిన భవిత...

ముసి పసి బోసి నవ్వుల గాంధీ తాత...
అహింసా మార్గంతో మార్చావు మా తల రాత...

బానిస బ్రతుకులకు ఇచ్చావు చేయూత...
నిను కన్నందుకు మురిసింది భరత మాత...

ప్రపంచానికి చాటావు భారతీయుల సమత...
భారతీయతకు పంచావు వెలకట్టలేని మమత...

నీ దేశ భక్తికి అభివందనం చేసింది వనిత...
నీ నిరాడంబరాతకు పాదాభివందనం చేసింది జనత...

నీ ఆత్మవిశ్వాసానికి తలవంచి నమస్కరించింది జగమంతా...
నీ జన్మభూమి ఋణం తీర్చుకోవడానికే సరిపోయింది జన్మంతా...! విశ్వ..!

వేల సార్లు మరణిస్తా...! విశ్వ..!

ఎటు చూసినా అన్యాయం... ఏ తలుపు తట్టినా అధర్మం...
ఎటు అడుగు వేసినా హింసా మార్గం... ఏ మలుపు తిరిగినా అరాచకత్వం...
ఇలాంటి అసమర్ధ నేతల చేతికి అధికారం ఇచ్చిన ప్రజల అవివేకం...
చూస్తుంటే జన్మ భూమి పొత్తిళ్ళలో మళ్ళి జన్మించాలని ఉంది... భరత మాత స్వేచ్చ కోరి పోరాడాలని ఉంది...
నా తల్లి స్వరాజ్యం స్వార్ధపరుల ఉచ్చులో చిక్కి సల్యమై పోతోంది...
నా తండ్రి స్వాతంత్ర్యం రాజకీయాల చిచ్చులో మాడి బూడిదై పోతోంది...
నా అన్నదమ్ముల కష్టార్జితం బలిసిన కామందుల చేతులు తడిపి బూడిదలో పోసిన పన్నీరై పోతోంది...
నా అక్కచెల్లెళ్ళ మాన ప్రాణాలు మదమెక్కిన కామాంధుల చేతులలో చిక్కి ఉక్కిరి బిక్కిరై పోతోంది...
ఈ ఆవేదనల నివేదనలు వింటుంటే మనసు చెలించి పోతోంది...
ఈ ఆకృత్యాల వికృత రూపాలను చూస్తుంటే మళ్ళి పోరాటం చేయాలని ఉంది...
బ్రష్టు పట్టిన రాజకీయ నేతల తుప్పు వదలగొట్టే దమ్మున్న యువత గుండెల్లో చైతన్యమై జన్మిస్తా...
అవినీతి రోచ్చిలో కుళ్ళి కృశించి పోతోన్న రాజకీయ తల రాతల మార్చే ప్రజల చేతులలో పిడికిలి నేనై జన్మిస్తా...
అవివేక ప్రజల అంధకారంలో ఆశా కిరణమై ఉదయిస్తా...
అవినీతిపరుల హృదయంలో ప్రళయ తండవమై ఉద్యమిస్తా...
సత్యాగ్రహానికి పట్టింది గ్రహణం... అహింసా మార్గానికి చెల్లింది కాలం...
అహింసతో హింసను అంతం చేయగలనన్న నమ్మకం అడుగంటి పోయింది...
అహింసా ఆయుధంతో హింస నెదిరించగలనన్న విశ్వాసం ఆవిరై పోయింది...
నన్ను కన్న భరత మాత ఋణం తీర్చుకొనేందుకు ఎన్ని వేల సార్లైనా జన్మిస్తా... జన్మభూమిని కాపాడాలనే ఆరాటంలో అన్ని వేల సార్లు మరణిస్తా...! విశ్వ..!

నా గురించి నేను (నాలో నేను)...! విశ్వ..!

నేను నేనే అనుకొనే మామోలు మనిషిని.. అనంత విశ్వంలో నిరంతర అన్వేషిని...
నేను నిత్య విద్యార్ధిని.. సత్య ధర్మ పరిరక్షణా బద్ధుడిని...
నా పేరు మేడిశెట్టి విజయ్ ప్రెమ్ స్వరూప్.. వైద్య విద్యార్ధిని...
నా ముద్దు పేరు బాబి.. కలం పేరు విశ్వ.. కవితలు వ్రాయడం హాబి...
నా ఊరు విశాఖపట్టణం.. పుట్టింది కాకినాడ.. చదువుతుంది చైనా...
నా వరకు నేను ఎవరి జోలికి వెళ్ళను.. నా జోలికి ఎవరైనా వస్తే విడువను...
నా తీరు నాకు నచ్చితే చాలనుకోను.. ఎవ్వరు ఎమన్నా పట్టించుకోను...
నా స్నేహితులకు నేను విలువిస్తాను.. అదే విలువని వారి నుంచి ఆశిస్తాను...
నా ప్రేమ అనంతం అనుకుంటాను.. నేను ప్రేమను ఇస్తాను తిరిగి ఆశించను...
నేను ప్రేమించినంతగా ఇంకెవ్వరు ఇంకెవ్వరిని ప్రేమించలేరు అని భావిస్తాను.. భావించేలా చేస్తాను...
నేను ఎవరినైనా సులువుగా నమ్మేస్తాను.. నమ్మిస్తాను, నాపై నమ్మకం ఎప్పుడు వదులుకోను...
నేను నాలా ఉండటానికే ఇష్టపడతాను.. అనుకున్నది సాధించడానికి కష్టపడతాను...
నేను అన్ని రంగాలలోను ప్రావీణ్యం కోసం ఆరాటపడతాను.. లక్ష్య సాధన కోసం సాదన చేస్తాను...
నాకు ఆకాశం అంటే ఇష్టం నీలి మేఘాలు ఎన్ని ఉన్నా విశాలంగా ఉంటుంది కనుక...
నాకు అవకాసం అంటే ఇష్టం ఎందుకంటే చేసిన తప్పులను తిరిగి దిద్దుకోగలం కనుక...
నాకు శేఖాహారం అంటే ఇష్టం ఎందుకంటే జీవ హింసను, మంసాహారాన్ని ఇష్టపడను కనుక...
నాకు నేనంటే ఇష్టం ఎందుకంటే నాకన్నా నన్ను కన్నవారిని ఎక్కువగా ఇష్టపడతాను కనుక...

{"కలలు అందరూ కంటారు కాని కన్న కలలు కొందరే సాధిస్తారు.. ఆ కొందరిలో నువ్వూ ఒక్కడిని కావాలి..
నిజంగా సాధించాలి అనే సంకల్పం నీలో రావాలి" - విశ్వ..!}

సమాధానం కావాలి...! విశ్వ..!

కులాలు కాలుదువ్వే కుమ్ములాటలు... మతాలు రెచ్చగొట్టే కారుచిచ్చులు...
ఆకతాయుల చెత్త చెత్త బెదిరింపులు... తీవ్రవాదుల కొత్త కొత్త ముట్టడింపులు...

ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో ప్రతి క్షణం ఎదురయ్యే మరణ మృదంగాలు...
ఏ వైపు నుంచి ముప్పు పొంచి ఉందో తెలియక క్షణమొక నరకంలా గడిపే జీవితాలు...

ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాలే తీవ్రవాదాన్ని కొమ్ముకాచి పెంచి పోషిస్తుంటే అడిగే దిక్కు లేదు...
అందలానికి ఎక్కించిన ప్రభువులకు ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ప్రాణాలను బలి తీసుకున్నా ఆశ్చర్యం లేదు...

ఎక్కడుంది మన సభ్య సమాజంలో సామాన్య పౌరునికి భద్రత...?
ఎక్కడుంది మన మతి చెలించిన మానవ జాతికి ప్రపంచంలో నిభద్రత...?

మండే గుండెతో ప్రశ్నిస్తుంది, మరిగే రక్తంతో తడిసి రక్త సిక్తమైన నా కవిత...
అంతు తెలియక ప్రశ్నిస్తుంది, ఎటూ తేల్చుకోలేని స్థితి గతులలో చిక్కిన నా భవిత...! విశ్వ..!

ప్రేమించకండి...! విశ్వ..!

ప్రేమిస్తున్నా అని చెప్పడానికి సంవత్సరాల సమయం తెసుకొనే మీకు...
ప్రేమించిన ప్రేమను శాస్వతంగా మరువడానికి నిమిషాల వ్యవధి చాలు...

నిన్ను కనిపెంచిన తల్లిదండ్రుల ప్రేమను విస్మరించమని చెప్పుట న్యాయం కాదు కాని...
తన కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించి ఆరాధించే నీ ప్రియుని ప్రేమ మరువుట భావ్యమా...?

క్షమించు అనే మూడక్షరాలతో ప్రేమ అనే రెండక్షరాల బంధానికి ముగింపు పలికేరు...
తల్లిదండ్రులు చూపిన అపరిచితునితో మూడుముళ్ళు వేయించుకొని వెళ్ళిపోయేరు...

చీర మార్చినంత తేలికగా మనసు మార్చుకొని మరో కొత్త జీవితానికి నాంది పలికేరు...
కాని మేము మీలా ఆలోచించలేము... మనసు చంపుకొని మరొకరితో జీవించలేము...

అందుకే ఈ మానసిక బాధ... జీవితాంతం మరువలేని వర్ణనాతీత వ్యధ... చిత్ర వధ...
తల్లిదండ్రులను నొప్పించకుండా ఒప్పించలేని ప్రేమికులారా దయచేసి ప్రేమించకండి...! విశ్వ..!

ఏమంటారు...! విశ్వ..!

తెలియక అడుగుతున్నా.. తెలుసుకోవాలని అడుగుతున్నా...
నాకు తెలియని విషయాన్ని పది మందికి తెలియజేయాలన్న ఆశతో అడుగుతున్నా...

ప్రాణ వాయువును పంచే ప్రాణి ఆయువుని అమానుషంగా తీసే వారిని మనిషులంటారా...?
వన్య ప్రాణుల స్వేచ్చకు సంకెళ్ళు వేస్తూ.. మనుగడను ప్రశ్నిస్తూ.. అటవీ సంపదకు నిప్పు పెట్టే నికృష్ట చేష్టను ఏమంటారు...?

ప్రతిఫలము ఆశించక తీయని ఫలాల్ని ఇచ్చే వృక్షాల్ని నరికే వారిని నరులంటారా.. మానవులంటారా...?
మండుటెండలో తానూ మాడుతూ మనకు నీడను కల్పించే నిస్వార్ధ జీవిని తన స్వార్ధం కోసం హతమార్చే జీవాన్ని ఏమంటారు...?

పరోక్షంగా సకల జివరాసులకు ప్రాణాధారమైన నీటిని దివి నుంచి భువికి దింపే ప్రత్యక్ష దైవాన్ని కాలరాసే కర్కశ హృదయాన్ని ఏమంటారు...?
విచక్షణా జ్ఞానం లేని పశువంటారా లేక మానవత్వం లేని మృగమంటారా.. ఏమంటారు...?

మర మనిషిని సృష్టించిన ఓ మానవ బ్రహ్మ.. ప్రకృతితో పని లేకుండా కృత్రిమ నీటిని సృష్టించ గలవా...?
వృక్షముతో పని లేకుండా కృత్రిమ శ్వాసను శాస్వతంగా ఈ జగమంతా వ్యాపింపజేయగలవా...? అది సాధ్యమా...

వృక్షో రక్షతి రక్షితః అన్న నగ్న సత్యాన్ని విస్మరించి మా(నవ) జాతి పతన్నాన్ని శాసించే వారిని ఏమంటారు...?
యాంత్రిక జీవితంతో పరుగులు తీసే మానవుడా నిజాన్ని గ్రహించు.. నీ దురాశలను నిగ్రహించు...

మేధస్సు ఎంత ఉన్నా ప్రకృతి తోడు లేని నాడు మానవుడు నిండు సున్నా.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఆ క్రోదాగ్ని జ్వాలలలో నసించక తప్పదు...
రాబోయే ఉపద్రవాన్ని గ్రహించు.. భావి తరాల ప్రాణాన్ని రక్షించు.. చెట్లను నరికే నేరస్తులను కఠినంగా శిక్షించు...! విశ్వ..!

Wednesday, April 21, 2010

About me కొంత.. : Medisetty Vijay Prem Swaroop {విశ్వ}

నేను నేనే అనంత విశ్వంలో అన్వేషిని..
నేను నిత్య విద్యార్ధిని.. నిరంతర ఆశావాదిని..
నా పేరు మేడిశెట్టి విజయ్ ప్రెమ్ స్వరూప్.. చదువుతుంది వైద్య విద్య..
నా ముద్దు పేరు బాబి.. కలం పేరు విశ్వ.. కవితలు వ్రాయడం నా హాబి..
నా ఊరు విశాఖపట్టణం.. పుట్టింది కాకినాడ.. చదువుతుంది చైనా దేశం..
నా వరకు నేను ఎవరి జోలికి వెళ్ళను.. నా జోలికి ఎవరైనా వస్తే వదలను..
నా తీరు నాకు నచ్చితే చాలు అనుకుంటాను.. ఎవ్వరు ఎమన్నా పట్టించుకోను..
నా స్నేహితులకు నేను విలువ ఇస్తాను.. అదే విలువని వారి నుంచి ఆశిస్తాను..
నా ప్రేమ అనంతం అనుకుంటాను.. నేను ప్రేమను ఇస్తాను ఆ ప్రేమను తిరిగి ఆశించను..
నేను ప్రేమించినంతగా ఇంకెవ్వరు ఇంకెవ్వరిని ప్రేమించలేరు అని భావిస్తాను.. అనేలా ప్రేమిస్తాను..
నేను ఎవరినైనా సులువుగా నమ్మేస్తాను.. నమ్మిస్తాను, నాపై నమ్మకం ఎప్పుడు వదులుకోను..
నేను నాలా ఉండటానికే ఇష్టపడతాను.. అనుకున్నది సాధించడానికి కష్టపడతాను..
నేను అన్ని రంగాలలోను ప్రావీణ్యం కోసం ఆరాటపడతాను.. సాధన కోసం సాదన చేస్తుంటాను..
నాకు ఆకాశం అంటే ఇష్టం నీలి మేఘాలు ఉన్నా విశాలంగా ఉంటుంది కనుక..
నాకు అవకాసం అంటే ఇష్టం ఎందుకంటే చేసిన తప్పులను తిరిగి దిద్దుకోగలం కనుక..
నాకు శేఖాహారం అంటే ఇష్టం ఎందుకంటే జీవ హింసను మంసాహారాన్ని ఇష్టపడను కనుక..
నాకు నేనంటే ఇష్టం ఎందుకంటే నేను నాకన్నా నన్ను కన్నవారిని ఇష్టపడతాను కనుక..

["కలలు అందరూ కంటారు కాని కన్న కలలు కొందరే సాధిస్తారు.. ఆ కొందరిలో నువ్వూ ఒక్కడిని కావాలి..
నిజంగా సాధించాలి అనే సంకల్పం నీలో రావాలి" - విశ్వ..!]